You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సీజేపీ నిరసనకారులపై దాడుల పిటిషన్‌ను తక్షణమే విచారించేందుకు సీజేఐ నిరాకరణ
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనకారులపై దిల్లీ పోలీసులు చర్యలపై దాఖలైన పిటిషన్ అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది.
నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ పిలుపు మేరకు ఈ నిరసన చేపట్టారు.
నిరసనకారులపై పోలీసులు వ్యవహరించిన తీరుకు సంబంధించి ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ స్పందించారు.
"మీ సమయాన్ని వృథా చేసుకోకండి, మా సమయాన్ని కూడా వృథా చేయకండి" అని సీజేఐ వ్యాఖ్యానించారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్య కాంత్, జస్టిస్ జొయమల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనల ధర్మాసనం ముందు హాజరైన ఆ న్యాయవాది.. ఈ విషయాన్ని మరుసటి రోజు విచారణ జాబితాలో చేర్చాలని కోరినట్టు ‘బార్ అండ్ బెండ్’ తెలిపింది.
‘ఆ వీడియోలు చూడాలన్న ఆసక్తి లేదు’
"పోలీసుల క్రూరత్వానికి వీడియో సాక్ష్యం ఉంది. విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్నారు. పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు" అని ఆ న్యాయవాది అన్నారు.
దీనిపై స్పందించిన భారత ప్రధాన న్యాయమూర్తి "దయచేసి మా సమయాన్ని వృథా చేయకండి, మీ సమయాన్ని కూడా వృథా చేసుకోకండి. మా సమయం కంటే మీ సమయం చాలా విలువైనది" అని అన్నారు.
నీట్ పరీక్షను నిష్పక్షపాతంగా నిర్వహించడం, పదేపదే పేపర్ లీక్‌లు జరుగుతున్నందున నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)ని రద్దు చేయడంతో పాటు కొన్ని ముఖ్యమైన డిమాండ్లు నెరవేర్చాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారని ఆ లాయర్ చెప్పారు.
కోర్టు తదుపరి కేసు విచారణ ప్రారంభించపోతుండగా నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యలకు సంబంధించిన వీడియోలను తాను చూపించగలనని న్యాయవాది మరోసారి చెప్పారు.
"మాకు ఆ వీడియోపై ఆసక్తి లేదు. వాటిని చూసేందుకు మాకు సమయం లేదు" అని సీజేఐ సూర్యకాంత్ స్పందించారు.
సోమవారం(ఈ నెల 20) జరిగిన నిరసన ప్రదర్శన సందర్భంగా, సీజేపీ నిరసనకారులు,విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి, బాష్పవాయువు ప్రయోగించారు. దీన్ని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు విమర్శించారు.
భారత్‌లో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును అణచివేస్తున్నారని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది.
సీజేఐ వ్యాఖ్యలతోనే సీజేపీ ఆవిర్భావం
కాక్రోచ్ జనతా పార్టీ మొదట వ్యంగ్యాత్మక ఆన్‌లైన్ ప్రచారకార్యక్రమంగా ప్రారంభమైంది.
మే 15న ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ కొన్న వ్యాఖ్యలు చేశారు. "వ్యవస్థపై దాడి చేసే పరాన్నజీవులు సమాజంలో ఇప్పటికే ఉన్నాయి. మీరు కూడా వారితో చేరాలనుకుంటున్నారా? కొంతమంది యువకులు ఉద్యోగం దొరక్క, తమ వృత్తిలో స్థానం సంపాదించుకోలేక, బొద్దింకల్లా అన్నిచోట్లా వ్యాపిస్తున్నారు" అని భారత ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలపై విస్తృతస్థాయిలో విమర్శలొచ్చాయి. ఆ విమర్శల తర్వాత తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారని పేర్కొంటూ సీజేఐ సూర్యకాంత్ ఒక వివరణ జారీ చేశారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)