అమిత్ షా, ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా చేయాలి: రాహుల్ గాంధీ
ప్రధాని ఇంటి ముందు మంగళవారం చేపట్టిన ధర్నా, తనను పోలీసులు అదుపులోకి తీసుకుని విడిచిపెట్టడం తరువాత రాహుల్ గాంధీ మంగళవారం రాత్రి ‘ఎక్స్’లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆయన అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసులు తనను ఉంచిన ఛత్రసాల్ స్టేడియంలో రికార్డ్ చేసినట్లుగా చెబుతున్న ఆ వీడియోలో రాహుల్ గాంధీ ఒక కాలికి మాత్రమే షూ వేసుకుని కనిపించారు.
‘సోమవారం జరిగిన ఘటనలపై చర్చకు అనుమతి ఇవ్వాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరాం. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని స్పీకర్ చెప్పారు. దీనిపై చర్చించేందుకు ప్రభుత్వానికి ఆసక్తి లేదని తర్వాత స్పష్టమైంది. దీంతో ప్రధాని నివాసం ముందు ధర్నా చేయాలని, విద్యార్థుల సమస్యలు, దేశంలోని సమస్యలన్నింటినీ ప్రజల దృష్టికి తేవాలని నిర్ణయించుకున్నాం.
భారత విద్యావ్యవస్థ ఎందుకు నాశనమైంది, పేపర్లు ఎందుకు లీకవుతున్నాయి?విద్య ఎందుకు భారత్‌లో ఖరీదైన వ్యవహారంగా మారింది, పిల్లలను చదివించడానికి ప్రజలు ఆర్థికంగా ఎందుకు పూర్తిగా నష్టపోతున్నారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రావాలి. ఈ ప్రశ్నలు అడగడంలో ఎలాంటి తప్పూలేదు.
విద్యార్థులు కోరినట్టుగా అమిత్ షా, ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. విద్యార్థులతో అవమానకరంగా ప్రవర్తించినవారిపై చర్యలు తీసుకోవాలి. విద్యార్థులపై కేసులు ఎత్తేయాలి. ఈ మొత్తం వ్యవహారంపై
పార్లమెంట్ ఉభయసభల్లో చర్చ జరపాలి.
ప్రతిపక్షనేతగా నేను ప్రధాని మోదీకి ఓ సలహా ఇస్తున్నా. సోమవారం జరిగిన ఘటనపై ప్రభుత్వం తరఫున విద్యార్థులకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి. పరీక్షల వ్యవస్థ, విద్యావ్యవస్థల్లో వీలయినంత తొందరగా సంస్కరణలు తేవాలి.
విద్యార్థుల సమస్యల కోసం పోరాడుతున్న ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని రాహుల్ అన్నారు.