‘మా కుటుంబాన్ని ఆదుకోవడానికి అక్క లండన్‌కు వెళ్లింది, కానీ ఆమెకు జరిగింది మరెవరికీ జరగకూడదు’

ఫొటో సోర్స్, Guar family
- రచయిత, ఆల్పా పటేల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
పశ్చిమ లండన్‌లో భర్త, బిడ్డతో కలిసి మంచంపై నిద్రిస్తున్న 24 ఏళ్ల యువతిని, ఇంట్లోకి చొరబడిన ఓ వ్యక్తి పదునైన ఆయుధంతో పొడిచి హత్య చేశాడని మృతురాలి సోదరి చెప్పారు.
‘తన సోదరే తన ప్రపంచమని’ ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
జులై 12న పశ్చిమ లండన్‌లోని హేస్‌లో భర్త, బిడ్డతో కలిసి తన ఇంట్లో నిద్రిస్తున్న కిరణ్‌దీప్ కౌర్‌పై దాడి జరిగింది. ఈ ఘటనలో ఆమె మరణించారు.
పంజాబ్‌లోని మాఝా ప్రాంతం నుంచి గుర్‌శరణ్ బీబీసీతో మాట్లాడుతూ, "ఆమె నా సర్వస్వం. నాకు, మా అమ్మకు ప్రతిరోజూ వీడియో కాల్స్ చేసేది. ఆమె లేకుండా మేమేం చేయాలి?" అన్నారు.
కౌర్‌ను హత్య చేసిన దుండగుడిపై కేసు నమోదైంది.

కుటుంబాన్ని ఆదుకోవడానికి, మంచి ఉద్యోగం వెతుక్కుంటూ తన సోదరి లండన్ వెళ్లిందని 21 ఏళ్ల గుర్‌శరణ్ చెప్పారు.
"మా అక్క బకింగ్‌హామ్‌షైర్ న్యూ యూనివర్సిటీలో చదువుకోవడానికి 2024 సెప్టెంబర్‌లో యూకే వెళ్లింది. చదువు పూర్తయిన తర్వాత ఒక కిరాణా షాపులో పనిచేసింది. మేం ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్లం. కానీ, ఆమె తిరిగి రాలేదు, నేను ఆమెను చూడలేకపోయాను" అని గుర్‌శరణ్ తెలిపారు.
"ఆమె లండన్ వెళ్లాక, అక్కడ చాలా బాగుందని, ఎంతో సంతోషంగా ఉన్నట్లు నాతో చెప్పింది" అన్నారు.
'నా చదువుకు ఎంతో సాయం చేసింది'
తన సోదరి చాలా తెలివైనదని గుర్‌శరణ్ చెప్పారు.
"ఇండియాలో చదువుకునే రోజుల్లో ఆమె తన క్లాస్‌లోనే టాపర్‌గా ఉండేది. చాలా కష్టపడే స్వభావం. మమ్మల్ని ఎంతో ప్రేమించేది. మా కుటుంబం చాలా పేదది. ఆమె ఎప్పుడూ మా గురించే ముందు ఆలోచించేది. నాకు ఎంతో అండగా నిలిచేది. ఆమె నా ప్రపంచం. నా గుండె పగిలిపోతోంది" అన్నారు.
కిరణ్‌దీప్ కౌర్ మృతితో ఆమె భర్త, పసికందు, తల్లిదండ్రులు, ముగ్గురు తోబుట్టువులు విషాదంలో మునిగిపోయారు. యూకేలోనే ఆమె వివాహం జరిగింది.
కిరణ్‌దీప్ కుటుంబం పంజాబ్‌లోని తరన్‌తరన్‌లో నివసిస్తోంది.
తన సోదరి మరణవార్త తమ గ్రామానికి చెందిన ఒకరి ద్వారా తెలిసిందని, అసలేం జరిగిందనే దానిపై తనకు ఇప్పటికీ చాలా తక్కువ సమాచారమే ఉందని గుర్‌శరణ్ బీబీసీతో చెప్పారు.
"నేను ఈ పరిస్థితిని తట్టుకోలేకపోతున్నాను, ఈ వార్తను జీర్ణించుకోలేకున్నాను. మా తల్లిదండ్రులు పూర్తిగా కుంగిపోయారు. మేం నలుగురం తోబుట్టువులం. అందరిలోకి పెద్దవాడు మా అన్నయ్య, ఆ తర్వాత కిరణ్‌దీప్, ఆపై మరో ఇద్దరు చిన్నవాళ్లు ఉన్నారు. తోబుట్టువులందరిలోకి నేనే చిన్నదాన్ని. ఈ వార్త తెలిసినప్పటి నుంచి మా అమ్మ అస్సలు బాగాలేదు, తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. మా నాన్న ఆరోగ్యం కూడా అంత బాగోలేదు. మా అక్కే నా సర్వస్వం, నాకు ఎంతో అండగా నిలిచేది, నన్ను ఎంతో ప్రేమించేది. మేమందరం బాగుండాలని చూసేది. నా చదువుకు ఎంతో సాయం చేసింది, నేను జీవితంలో పైకి రావాలని ఆశపడింది" అన్నారు.

ఫొటో సోర్స్, Family handout
'న్యాయం కావాలి'
లండన్‌లో తన సోదరికి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఎప్పుడూ అనుకోలేదని గుర్‌శరణ్ అన్నారు.
"నేను మా అక్కను ఒక రోల్ మోడల్‌గా చూసేదాన్ని. నా చదువు ఫీజులు కట్టడానికి తనే సాయం చేసేది" అన్నారామె.
కిరణ్‌దీప్ భౌతికకాయాన్ని భారత్‌కు తీసుకురావాలని ఆమె కుటుంబం కోరుకుంటోంది.
"2024లో లండన్ వెళ్లినప్పటి నుంచి ఆమెను నేను చూడలేదు. చివరిసారిగా ఒక్కసారైనా చూసేందుకు అక్కను ఇంటికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. మా తల్లిదండ్రులు కూడా ఆమెను ఆఖరిసారిగా చూడాలని ఎదురుచూస్తున్నారు. మా గ్రామంలోనే అంత్యక్రియలు నిర్వహించాలనుకుంటున్నాం" అని గుర్‌శరణ్ చెప్పారు.
కౌర్ స్మారకార్థం శుక్ర, శనివారాలు హేస్‌లోని సిక్కు సంఘం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించింది.
దీనిపై గుర్‌శరణ్ మాట్లాడుతూ.. "లండన్‌లో మా అక్క కోసం జరుగుతున్న సభలకు, ప్రార్థనలకు వస్తున్న అక్కడి ప్రజలకు మేం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితి మరే ఇతర కుటుంబానికీ రాకూడదని ఆశిస్తున్నాం. మా గ్రామంలో సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు అక్క భౌతికకాయాన్ని మాకు అప్పగించాలి. ఇలా ఇంకెవరికీ జరగకూడదు. మాకు న్యాయం కావాలి" అన్నారు.
తెల్లవారుజామున హత్య
జులై 12 తెల్లవారుజామున ఉక్స్‌బ్రిడ్జ్ మార్గంలోని కౌర్ నివాసంలోకి 46 ఏళ్ల డేనియల్ సీన్ జేమ్స్ చొరబడి, నిద్రిస్తున్న కౌర్‌పై దాడిచేశాడు.
అనంతరం కిటికీలోంచి దూకిన జేమ్స్‌కు రెండు చీలమండలు విరిగాయి. అనంతరం ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇంట్లోకి చొరబడటానికి ముందు వీధిలో నడుచుకుంటూ వెళుతున్న ఓ 20 ఏళ్ళ యువకుడిపైనా నిందితుడు దాడి చేశాడు.
నిందితుడిపై హత్య, హత్యాయత్నం, పదునైన ఆయుధం కలిగి ఉన్నట్లు కేసులు నమోదయ్యాయి.
జేమ్స్‌ను రిమాండ్‌కు తరలించాలని న్యాయమూర్తి నైగెల్ లిక్లీ కేసీ ఆదేశించారు. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 1కి ఖరారు చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























