జంతర్ మంతర్ నుంచి తమ వేదికను పోలీసులు తొలగించారన్న కాక్రోచ్ జనతా పార్టీ, నిరాహార దీక్ష కొనసాగిస్తానన్న సోనమ్ వాంగ్‌చుక్

ఫొటో సోర్స్, Getty Images
జంతర్ మంతర్ వద్ద ఉన్న తమ నిరసన వేదికను దిల్లీ పోలీసులు తొలగించారని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తెలిపింది.
దీనిపై సీజేపీ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేసింది. "పోలీసులు నిరసన వేదికను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ అమర్చిన వస్తువులన్నింటినీ ధ్వంసం చేసి తొలగించారు. ఒక పక్కన పడి ఉన్న బాబాసాహెబ్ అంబేడ్కర్ చిన్న విగ్రహం, భారత రాజ్యాంగ ప్రతి, శ్రీరామచరితమానస్, బైబిల్ మాత్రమే అక్కడ మిగిలాయి. ఈ రోజు భారతదేశంపై అత్యంత క్రూరమైన దాడి జరిగింది" అని అందులో రాసింది.
దీనికి సంబంధించిన ఒక ఫోటోను కూడా సీజేపీ షేర్ చేసింది.
దీనికంటే ముందు, సీజేపీ పిలుపు మేరకు సోమవారం నాటి పార్లమెంట్ మార్చ్‌కు ఆ పార్టీ మద్దతుదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తమ నిరసన కొనసాగుతోందని సీజేపీ సాయంత్రం ప్రకటించింది.

ఫొటో సోర్స్, X/Cockroachisback
నిరాహార దీక్ష కొనసాగిస్తా : వాంగ్‌చుక్
జులై 17 నుంచి సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోనమ్ వాంగ్‌చుక్.. తాను నిరాహార దీక్షను కొనసాగిస్తానని ప్రకటించారు. 'శాంతియుత నిరసనకారులపై దిల్లీ పోలీసులు క్రూరంగా ప్రవర్తించడం' వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
వాంగ్‌చుక్ అధికారిక ఎక్స్ ఖాతాలో దీనికి సంబంధించిన ఒక లిఖితపూర్వక లేఖను షేర్ చేశారు.

ఫొటో సోర్స్, Vipin Kumar/Hindustan Times via Getty Images
తమ యువ నాయకులు మంగళవారం లేదా బుధవారం పార్లమెంట్‌లో ఎంపీల ముందు అభిప్రాయాలను వినిపించేందుకు ప్రభుత్వం అనుమతించాలని, లేదంటే ఆసుపత్రిలో వారిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని అందులో కోరారు. అప్పుడే తాను నిరాహార దీక్షను విరమిస్తానని స్పష్టం చేశారు.
సోమవారం నాటి పార్లమెంట్ మార్చ్‌కు శాంతియుతంగా తరలివచ్చిన మద్దతుదారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే రకమైన మద్దతును ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, X/Wangchuk66
నిరసన కొనసాగుతుందన్న సీజేపీ
జంతర్ మంతర్ వద్ద తమ నిరసన ఇంకా కొనసాగుతోందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తెలిపింది.
ఆ పార్టీ తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్‌లో "అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్నారు" అని పేర్కొంది.
"వారు ప్రస్తుతం కేరళ హౌస్ ఎదుట ఉన్నారు. ఈ శాంతియుత నిరసన ముగియదు" అని ఆ పోస్టులో రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

ఫొటో సోర్స్, X/SauravDassss
కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ
కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సోమవారం భేటీ అయినట్లు కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. ఈ అంశంపై చర్చిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
సౌరవ్ దాస్ తనతో పాటు ఆశుతోష్ రాంకా, జేపీ నడ్డాతో కలిసి ఉన్న ఫోటోను ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు.
అయితే, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటివరకు దీనిపై ఎలాంటి బహిరంగ ప్రకటన రాలేదు.
సౌరవ్ దాస్ తన ఎక్స్ పోస్టులో "ఆశుతోష్ రాంకా, నేను మధ్యాహ్నం 12 గంటల నుంచి జేపీ నడ్డా నివాసంలో ఉన్నాం. ధర్మేంద్ర ప్రధాన్‌తో వెంటనే రాజీనామా చేయించడం సహా ఇతర డిమాండ్ల గురించి ఆయనకు వివరించాం. ఈ అంశంపై చర్చిస్తామని మంత్రి మాకు హామీ ఇచ్చారు.
అయితే, ఇప్పటివరకు ఎలాంటి వాగ్దానం చేయలేదు. డిమాండ్లు నెరవేరే వరకు శాంతియుతంగా ప్రదర్శనలు చేసేవారు ప్రశాంతంగా కూర్చోరు" అని రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, X/TelanganaCMO
రేవంత్ రెడ్డి మద్దతు
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా తరలివచ్చిన విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం దారుణమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
రేవంత్ రెడ్డి ఎక్స్ పోస్టులో "ఏ యువత భవిష్యత్తునైతే ప్రమాదంలో పడేసిందో, అదే యువత స్వరాన్ని నొక్కేసేందుకు కేంద్ర ప్రభుత్వం పోలీసు బలగాలను ఉపయోగిస్తోంది. నిరసనకారులపై పడుతున్న ప్రతి లాఠీ దెబ్బ.. నిజం, ప్రజాస్వామ్య అసమ్మతి అంటే బీజేపీకి ఉన్న భయాన్ని స్పష్టం చేస్తోంది.
నేను దేశంలోని విద్యార్థులకు అండగా నిలబడుతున్నాను. విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాలను వెంటనే ఆపాలి. 'నీట్' సహా మిగతా పేపర్ లీకేజీల కుంభకోణాలపై కేంద్రం తక్షణమే జవాబుదారీతనం వహించాలి" అని రాశారు.

ఫొటో సోర్స్, Reuters
అభిజీత్ దీప్కేను పోలీసులు తీసుకెళ్లారా?
'పార్లమెంట్ మార్చ్' పిలుపు నేపథ్యంలో, కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
అయితే, సీజేపీ వాదనలను దిల్లీ పోలీసులు తిరస్కరించారు.
దిల్లీ పోలీసులు ఎక్స్ పోస్టులో "అభిజీత్ దీప్కేను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తప్పుడు వార్తలు ప్రచారమవుతున్నాయి. ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు, ఆయన అక్కడే వేదికపైనే ఉన్నారని అధికారికంగా స్పష్టం చేస్తున్నాం" అని రాశారు.
మరోవైపు, రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్న విద్యార్థులకు ఎంపీలు మద్దతుగా నిలవాలని సౌరవ్ దాస్ విజ్ఞప్తి చేశారు. శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
అప్డేట్ అంటూ మరో పోస్ట్ చేసిన సౌరవ్ దాస్, "దీప్కే పోలీసుల నిర్బంధంలో లేరు, అరెస్టు కాలేదు. కేరళ హౌస్ బయట భారీ జనసందోహం ఉంది" అని పేర్కొన్నారు.

అంతకుముందు అభిజీత్ దీప్కే, సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో సోమవారం పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు.
అయితే, పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి టియర్ గ్యాస్ ప్రయోగించారు.
బీబీసీ ప్రతినిధి దిల్‌నవాజ్ పాషా తెలిపిన వివరాల ప్రకారం, దీప్కే, గీతాంజలి నాయకత్వంలో నిరసనకారులు పార్లమెంట్ వైపు దూసుకెళ్తుండగా పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. దీనికోసం పోలీసులు రోడ్డుపై భారీగా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు.
అభిజీత్ దీప్కే నిరాహార దీక్ష విరమణ
మరోవైపు, అభిజీత్ దీప్కే సోమవారం తన నిరాహార దీక్షను విరమించారు. ఆయన తన దీక్ష విరమించడానికి సంబంధించిన వీడియో ఒకటి ఏఎన్ఐ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.
సోనమ్ వాంగ్‌చుక్‌ను శనివారం దిల్లీ పోలీసులు జంతర్ మంతర్ నుంచి తరలించి ఆసుపత్రిలో చేర్చినప్పుడు అభిజీత్ దీప్కే తన దీక్ష ప్రారంభించారు.
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) సోమవారం 'పార్లమెంట్ మార్చ్'కు పిలుపునివ్వడంతో సోమవారం ఉదయం నుంచి జంతర్ మంతర్ వద్ద పరిణామాలు వేగంగా మారుతూ వచ్చాయి.
ఉదయం నుంచి సీజేపీకి మద్దతుగా పెద్దసంఖ్యలో ప్రజలు చేరారు. సీజేపీ చీఫ్ స్పోక్స్‌పర్సన్ సౌరవ్ దాస్‌ను పోలీసులు డిప్యూటీ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి తీసుకెళ్లారు.
'ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం' అని సౌరవ్ దాస్ 'ఏఎన్ఐ'తో చెప్పారు. అయితే, ప్రభుత్వం వైపు చర్చలు జరుపుతున్నట్లు ఎలాంటి అధికారిక ప్రకటన ఇంతవరకు రాలేదు.
అంతకుముందు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా తమను చర్చలకు పిలిచారని.. తాను, మరో అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా చర్చలు జరుపుతామని సౌరవ్ దాస్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
జంతర్ మంతర్ వద్ద ఉదయం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడారని అక్కడ ఉన్న బీబీసీ విలేఖరి దిల్‌నవాజ్ పాషా తెలిపారు.
పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారని, కిలోమీటరు దూరంలో కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారని మరో బీబీసీ విలేఖరి పవన్‌కాంత్ దిగవల్లి చెప్పారు. ఆరు అడుగుల ఎత్తున్న బారికేడ్లు ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు.
కాగా జంతర్‌మంతర్ దగ్గర పెద్దఎత్తున చేరిన సీజేపీ మద్దతుదారులను చెదరగొట్టడానికి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) సిబ్బంది లాఠీలు ఉపయోగిస్తున్న దృశ్యాలను న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తన 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేసింది.
మరోవైపు దిల్లీ పోలీసులు ‘ఎక్స్’ వేదికగా ఒక ప్రకటన చేశారు. ‘జంతర్ మంతర్ వద్ద దిల్లీ పోలీసులు కొంతమేర హింసకు, అరెస్టులకు పాల్పడినట్లు కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే, అలాంటి సంఘటనలేవీ జరగలేదని, నిరసనను వృత్తిపరమైన రీతిలో నిష్పక్షపాతంగా హ్యాండిల్ చేస్తున్నాం. ఎలాంటి వదంతులను నమ్మొద్దు’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

తొలుత కాక్రోచ్ జనతా పార్టీ సోమవారం ఉదయం 9 గంటలకు జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ హౌస్ వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించింది.
అయితే, ఈ పాదయాత్రకు దిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు.
అనేకమంది ప్రతిపక్ష నాయకులు ఈ యాత్రకు మద్దతు తెలిపారు. తాము కూడా ఇందులో పాల్గొంటామని చెప్పారు.
అయితే నిరసనకారులను పార్లమెంట్ భవనం వరకు యాత్ర చేయడానికి దిల్లీ పోలీసులు నిరాకరించారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం(20.07.2026) నుంచి ప్రారంభం కావడంతో నిరసనకారులు పార్లమెంట్ భవనానికి వెళ్లి తమ డిమాండ్లను వినిపించాలనుకుంటున్నారు.
"మేం ఉదయం 9 గంటలకు వేల సంఖ్యలో పార్లమెంటుకు బయలుదేరుతాం. మా డిమాండ్లను వాళ్ల ముందు పెడతాం. మా డిమాండ్లను వినిపించేందుకు వీలుగా మా ప్రతినిధి బృందాన్ని లోపలికి అనుమతించాలి" అని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఇంతకుముందు ఆదివారం ‘బీబీసీ’తో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పార్లమెంటుకు తాము యాత్ర విజయవంతంగా పూర్తి చేస్తామనే ధీమా ఆయన కనబరిచారు.
"బారికేడ్లు ఉన్నప్పటికీ మేం బయటకు రాగలం. ఎందుకంటే ప్రజలు వేల మంది వస్తున్నారు. పోలీసులు మమ్మల్ని ఎందుకు ఆపుతారు? మేమేమీ తప్పు చేయడం లేదు" అని దీప్కే అన్నారు.
అంతకుముందు, నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు.
నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలకు నిరసనగా ఆయన జూన్ 28న దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష ప్రారంభించారు.
ఆయనతో పాటు ఇతర నిరసనకారులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఫొటో సోర్స్, ANI
వాంగ్‌చుక్‌ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయడానికి దిల్లీ హైకోర్టు నిరాకరించడంతో తన భర్త వాంగ్‌చుక్ తరఫున సోమవారం పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొంటానని గీతాంజలి తెలిపారు.
ఎంపీలు, నాయకులు ఆసుపత్రిలో ఉన్న తన భర్తను కలిసి విద్యారంగంలో జవాబుదారీతనం అంశాన్ని పార్లమెంట్ సమావేశాల సమయంలో లేవనెత్తుతామని హామీ ఇస్తే సోనమ్ సోమవారం తన నిరాహార దీక్షను విరమిస్తారని వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో చెప్పారు.
కాగా సోమవారం ఉదయం సోనమ్ వాంగ్‌చుక్ తన దీక్ష విరమణకు సంబంధించి మూడు షరతులు విధిస్తూ ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. నీట్ ప్రశ్నపత్నం లీక్ సహా పరీక్షల్లో అవకతవకలకు ప్రభుత్వం బాధ్యత వహించడం వంటి షరతులు అందులో ఉన్నాయి.

దిల్లీ పోలీసులు ఏం చెప్పారు?
పార్లమెంట్ మార్చ్‌కు అనుమతి నిరాకరిస్తూ, దిల్లీ పోలీసులు ఆదివారం సాయంత్రం ఒక అడ్వైజరీ విడుదల చేశారు.
"జూలై 20న పార్లమెంటుకు మార్చ్ చేయడానికి దిల్లీ పోలీసులకు ఎలాంటి దరఖాస్తు అందలేదని, అలాగే ఎలాంటి అనుమతి కూడా ఇవ్వలేదని స్పష్టం చేస్తున్నాను" అని దిల్లీ డీసీపీ సచిన్ శర్మ అన్నారు.
నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. దీని ప్రకారం జంతర్ మంతర్ వద్ద నిర్దేశించిన నిరసన స్థలం మినహా, ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం, నిరసన మార్చ్ లేదా ప్రదర్శనలను నిషేధించారు.
ఈ మార్చ్‌లో పాల్గొనవద్దని దిల్లీ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అడుగడుగునా అడ్డంకులు.. బయటకు వెళ్లడం కష్టం
జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదేశం చుట్టూ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్కడ పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు.
నిరసన ప్రదేశానికి సమీపంలో బారికేడింగ్ ఏర్పాటు చేశారు. అక్కడికి చేరుకోవడం, అక్కడి నుంచి బయలుదేరడం సులభం కాదు అని జంతర్ మంతర్ వద్ద పరిస్థితులను రిపోర్టింగ్ చేస్తున్న బీబీసీ ప్రతినిధి జుగల్ పురోహిత్ అన్నారు.
నిరసన స్థలం నుండి బయటకు వెళ్లే దారిలో సుమారు నాలుగు వరుసల బారికేడ్లను ఏర్పాటు చేశారని జుగల్ తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































