ఎల్‌హెచ్ఎస్ 1140 బీ: సౌర కుటుంబం అవతల భూమిలాంటి గ్రహంపై వాతావరణాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

రాతి గ్రహం, వాతావరణం, భూమి లాంటి గ్రహం, గోల్డిలాక్స్ జోన్

ఫొటో సోర్స్, Melissa Weiss/Center for Astrophysics |Harvard & Smithsonian

ఫొటో క్యాప్షన్, ఒక ఎర్రటి నక్షత్రం చుట్టూ తిరుగుతున్న రాతి గ్రహం వాతావరణాన్ని ఈ ఎరుపు రంగు సూచిస్తోంది (గ్రాఫికల్ చిత్రం).
    • రచయిత, పల్లబ్ ఘోష్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

సుదూర విశ్వంలో భూమిని పోలిన ఒక రాతి గ్రహంపై పరిశోధకులు తొలిసారిగా వాతావరణాన్ని గుర్తించారు. జీవరాశి మనుగడకు సాధ్యమయ్యే అనుకూల దూరంలో ఈ గ్రహం తన నక్షత్రం చుట్టూ తిరుగుతోంది.

మన సౌర కుటుంబం వెలుపల కూడా భూమి లాంటి పరిస్థితులు ఉన్న ప్రపంచాలు ఉండవచ్చనే దానికి ఈ ఆవిష్కరణే అత్యంత బలమైన ఆధారమని పరిశోధకులు చెబుతున్నారు.

ఈ వాతావరణంలో గుర్తించిన హీలియం వాయువు జీవరాశి మనుగడకు అనుకూలమైనది కాకపోయినప్పటికీ, అక్కడ ఇతర వాయువులు కూడా ఉండే అవకాశం ఉంది.

"ప్రస్తుత ఆవిష్కరణ చాలా పెద్ద విజయం" అని ఈ పరిశోధన ప్రధాన రచయిత, హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ కాలిన్ చెరుబిమ్ అభివర్ణించారు.

సౌర కుటుంబం వెలుపల, జీవరాశి మనుగడకు అనుకూలమైన ఒక రాతి గ్రహంపై వాతావరణాన్ని గుర్తించడం ఇదే తొలిసారని ఆయన అన్నారు.

'ఎల్‌హెచ్ఎస్ 1140 బీ' అనే పేరు గల ఈ గ్రహం భూమికి 48 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇది మన సూర్యుడి కంటే చాలా చిన్నగా, చల్లగా ఉండే ఒక ఎర్రటి నక్షత్రం చుట్టూ తిరుగుతుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

'మరొక ప్రపంచంపై జీవం అన్వేషణ'

శాస్త్రవేత్తలు ఇప్పటివరకు సుదూర నక్షత్రాల చుట్టూ తిరిగే 6,000 కంటే ఎక్కువ గ్రహాలను కనుగొన్నారు. అయితే, సైన్స్ రంగం అతిపెద్ద విజయాలలో ఒకటైన 'మరొక గ్రహంపై జీవం అన్వేషణ' వైపు ఈ కొత్త ఆవిష్కరణ మనల్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్లింది. అందుకే ఇది ఎంతో ప్రత్యేకం. అయితే, తాము ఇంకా ఆ లక్ష్యాన్ని సాధించలేదని (జీవాన్ని కనుగొనలేదని) 'సైన్స్' పత్రికలో పరిశోధకులు చెప్పారు.

కానీ, ఒక గ్రహం జీవానికి అనుకూలంగా ఉండాలంటే అక్కడ నీరు ఉండటం అవసరం. దానికి ఆ గ్రహం తన నక్షత్రం నుంచి సరైన దూరంలో ఉండాలి: నక్షత్రానికి మరీ దగ్గరగా ఉంటే విపరీతమైన వేడి, చాలా దూరంలో ఉంటే విపరీతమైన చలి ఉంటాయి. అందువల్ల అది జీవానికి "సరిగ్గా సరిపోయే" మధ్యస్థ దూరంలో ఉండాలి.

ఖగోళ శాస్త్రవేత్తలు దీనిని "గోల్డిలాక్స్ జోన్" (జీవన అనుకూల ప్రాంతం) అని పిలుస్తారు. పాయసం (జావ) ఎక్కువ వేడిగా లేకుండా, అలాగే చల్లగా ఉండకుండా సరిగ్గా ఉండేలా ఎంచుకునే జానపద కథలోని ఒక చిన్నారి పేరు మీదుగా ఈ ప్రాంతానికి ఆ పేరు పెట్టారు.

ఆయా నక్షత్రాల గోల్డిలాక్స్ జోన్లలో వందలాది గ్రహాలను కనుగొన్నారు. అయితే, వాటిలో మన భూమి లాగా చిన్నగా, రాతితో కూడినవి కేవలం పదుల సంఖ్యలో ఉన్నాయి. ఒక గ్రహంపై జీవం ఉండటానికి ఇది మరొక సానుకూల అంశం.

కానీ, ఇప్పటివరకు వాటిలో దేనిపై వాతావరణం ఉన్నట్లు గుర్తించలేదు.

అయితే, ఈ వాతావరణంలో ఇప్పటివరకు కనుగొన్న ఏకైక వాయువు హీలియం మాత్రమే, బహుశా ఇది వాతావరణం పైభాగంలో ఉండి ఉండవచ్చు. ఇది ఒక్కటే జీవించడానికి అనుకూలమైనది కాదు.

కానీ, వాతావరణం కింది భాగంలో జీవానికి తోడ్పడే ఇతర వాయువులు ఉండే అవకాశం ఉంది. మన సౌర కుటుంబం వెలుపల వాతావరణం ఉన్న, భూమి లాంటి ఒక రాతి గ్రహాన్ని కనుగొనడమే ఇక్కడ ముఖ్యమైన విషయమని హార్వర్డ్‌కు చెందిన మరొక పరిశోధకుడు డాక్టర్ డేవిడ్ చార్బోనో చెప్పారు.

"ప్రజలు సాధారణంగా కొన్ని పెద్ద ప్రశ్నలపై ఆసక్తి చూపిస్తారు: ఈ విశ్వంలో మనం ఒంటరిగా ఉన్నామా? భూమికి లేదా మన సౌర కుటుంబానికి అవతల జీవం ఉందా? ఆ అన్వేషణలో భాగంగా, మన సౌర కుటుంబం వెలుపల ఉన్న ఒక నక్షత్ర నివాస యోగ్య ప్రాంతంలో, ఒక రాతి గ్రహంపై వాతావరణాన్ని కనుగొన్న తొలి ఆవిష్కరణను ఈ పరిశోధన వెల్లడిస్తోంది" అని ఆయన అన్నారు.

ఇతర గ్రహాలపైనా నిఘా

జీవం కోసం సాగుతున్న అన్వేషణలో కేవలం 'ఎల్‌హెచ్ఎస్ 1140బీ' గ్రహంపై మాత్రమే శాస్త్రవేత్తలు దృష్టి పెట్టలేదు. లోపలి భాగంలో విస్తారంగా నీరు ఉండే అవకాశం ఉన్న, నెప్ట్యూన్ కంటే కాస్త చిన్నదైన 'కే2-18బీ' గ్రహం గతంలో వార్తల్లో నిలిచింది. భూమిపై సముద్ర జీవుల వల్ల విడుదలయ్యే 'డైమిథైల్ సల్ఫైడ్' వాయువు ఆనవాళ్లను శాస్త్రవేత్తలు అక్కడ గుర్తించడమే అందుకు కారణం.

కానీ, 2025లో నాసా నేతృత్వంలో జరిగిన పునఃపరిశీలనలో ఆ సంకేతాలు చాలా బలహీనంగా ఉన్నట్లు తేలింది. జీవరాశి ప్రమేయం లేకుండా కూడా ఈ వాయువు ఏర్పడవచ్చని ఆ పరిశోధన స్పష్టం చేసింది.

మరోవైపు 'ట్రాపిస్ట్-1' నక్షత్ర వ్యవస్థలోని ఏడు రాతి గ్రహాలు కూడా శాస్త్రవేత్తల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ 'ట్రాపిస్ట్-1డీ' గ్రహంపై భూమి లాంటి వాతావరణం ఏదీ లేదని తేల్చి చెప్పింది. అలాగే, 'ట్రాపిస్ట్-1ఇ' గ్రహానికి సంబంధించిన సమాచారంపై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)