పదేళ్ల బాలుడి పురుషాంగంలో కొంత భాగం తొలగించడానికి కారణం వైద్యుల నిర్లక్ష్యమేనా?

వైద్యుల నిర్లక్ష్యం, బాలుడి పురుషాంగం సర్జరీ,  ఇండియన్ మెడికల్ అసోసియేషన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సిరాజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

(ఈ కథనంలోని కొన్ని అంశాలు మిమ్మల్ని కలవరపరచవచ్చు)

తమిళనాడులోని శివగంగ జిల్లా కారైకుడిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల తప్పుడు చికిత్స కారణంగా తమ పదేళ్ల కుమారుడికి పెనెక్టమీ (పురుషాంగాన్ని శస్త్రచికిత్స చేసి తొలగించడం) చేయాల్సి వచ్చిందని ఆరోపిస్తూ ఆ బాలుడి తల్లిదండ్రులు గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నెల రోజులు గడిచినా పోలీసులు సంబంధిత వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు.

ఈ విషయమై బాలుడి తల్లిదండ్రులు, యూనియన్లు, భారత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు జూలై 7న కారైకుడిలో నిరసన తెలిపారు.

కేసు నమోదు చేసినట్లు పోలీసులు బీబీసీకి తెలిపారు.

ఈ సంఘటనలో 'వైద్యపరమైన నిర్లక్ష్యం'పై ప్రస్తుతం తమిళనాడు ఆరోగ్య శాఖ శాఖ జాయింట్ డైరెక్టర్ విచారణ జరుపుతున్నారని, ఈ విచారణకు సంబంధించిన నివేదిక వచ్చిన తర్వాత వైద్యులపై చర్య తీసుకుంటారని అధికారులు చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
శస్త్రచికిత్స

ఫొటో సోర్స్, Getty Images

సర్జరీ ఎందుకు అవసరమైంది?

కారైకుడిలో నివసిస్తున్న దంపతులకు 10 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.

"వైద్యుల తప్పుడు చికిత్స కారణంగా నా కొడుకు పురుషాంగంలో చాలా భాగాన్ని తొలగించాల్సి వచ్చింది. దీనివల్ల అతని భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది" అని బాలుడి తల్లి అన్నారు.

"మాకు ఒకడే కొడుకు. వాడికి పురుషాంగంలో దురదగా ఉండేది. కారైకుడిలో ప్రైవేట్ ఆసుపత్రికి మే నెలలో తీసుకెళ్లాం. డాక్టర్ పరీక్షించి శస్త్రచికిత్స చేసి పురుషాంగం పైచర్మాన్ని తొలగించాల్సి ఉంటుందని చెప్పారు" అని ఆమె తెలిపారు.

"ఆందోళన పడాల్సిన పనిలేదని డాక్టర్ మాకు చెప్పారు. అది సాధారణ శస్త్రచికిత్సే అయినా దాన్ని వెంటనే చేయాల్సి వచ్చింది. మేం అంగీకరించాం. మే 21న శస్త్రచికిత్స చేశారు. అయితే, ఆపరేషన్ చేసిన సర్జన్ వాస్తవానికి కారైకుడిలోని మరో ప్రైవేట్ ఆసుపత్రి నుంచి వచ్చారని మాకు తర్వాత చెప్పారు" అని బాలుడి తల్లి వివరించారు.

వైద్యుల నిర్లక్ష్యం, బాలుడి పురుషాంగం సర్జరీ,  ఇండియన్ మెడికల్ అసోసియేషన్
ఫొటో క్యాప్షన్, బాధిత కుటుంబానికి మద్దతుగా జూలై 7న సీపీఐ, ట్రేడ్ యూనియన్లు ఆందోళన చేశాయి.

శస్త్ర చికిత్స పూర్తయిన కొన్ని రోజుల తర్వాత బాలుడి పురుషాంగంలో తీవ్రమైన నొప్పి రావడం, మూత్ర విసర్జనలో ఇబ్బంది వంటి సమస్యలు మొదలయ్యాయి.

"అతని పురుషాంగం నల్లగా మారింది. మూత్ర విసర్జన చేయలేకపోయాడు. తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు. మేం అతన్ని తిరిగి అదే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లినప్పుడు అతనికి ఇన్ఫెక్షన్ సోకిందని చెప్పి శస్త్రచికిత్స చేసిన ఏ ఆసుపత్రిలో పనిచేస్తారో అక్కడికి పంపించారు. మమ్మల్ని ఆ రెండు ఆసుపత్రుల మధ్య అటూ ఇటూ తిప్పారు" అని బాలుడి తల్లి చెప్పారు.

"ఆ తర్వాత మే 27న నా కొడుకుకి మరో ప్రైవేట్ ఆసుపత్రిలో ఇంకో శస్త్రచికిత్స జరిగింది. అతను రెండు రోజుల్లో కోలుకుంటాడని ఆందోళన పడాల్సిన అవసరం లేదని అక్కడి డాక్టర్లు హామీ ఇచ్చారు. కానీ మే 28 ఉదయం ఇన్ఫెక్షన్ తీవ్రంగా మారిందని అతన్ని వెంటనే మదురైకి తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పారు" అని ఆమె వివరించారు.

తర్వాత జరిగిన పరిణామాల్ని గురించి "వాడిని మధురైలోని స్పెషాలిటీ హాస్పిటల్‌కు తీసుకువెళ్లమని వారు పట్టుబట్టారు. అప్పటికే వారిపై మాకు నమ్మకంపోవడంతో, మేం మా అబ్బాయిని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లి అత్యవసర విభాగంలో చేర్పించాం" అని ఆమె అన్నారు.

అక్కడ బాలుడిని పరీక్షించిన తర్వాత వైద్యులు.. "పురుషాంగం నల్లగా మారి, ఇన్ఫెక్షన్‌తో తీవ్రంగా దెబ్బతింది. వెంటనే శస్త్రచికిత్స చేసి పురుషాంగంలో చాలా భాగాన్ని తొలగించాల్సిన అవసరం ఏర్పడింది. అలా చేయకపోతే అతని ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది" అని చెప్పారు.

"మాకు వేరే మార్గం లేదు. ఆ సమయంలో మాకు అత్యంత ముఖ్యమైన విషయం మా అబ్బాయి ప్రాణాలు కాపాడటమే. అందుకే డాక్టర్లు చెప్పిన దానికి మేం అంగీకరించాం" అని ఆ పిల్లవాడి తల్లి అన్నారు.

ఆపరేషన్ పూర్తైన తర్వాత జూన్ 6న బాలుడి తల్లిదండ్రులు కారైకుడిలోని రెండు ప్రైవేట్ ఆసుపత్రులకు చెందిన ఇద్దరు వైద్యులపై పోలీసులు, శివగంగ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

జూన్‌లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్ బాలుడికి చికిత్స అందిస్తున్న వైద్యులతో కలిసి ఈ ఫిర్యాదుపై వివరణ ఇచ్చారు.

"ఆ బిడ్డకు చేసిన శస్త్రచికిత్స నార్మల్, రొటీన్‌గా జరిగేదే. అయితే ఈ సమస్య అరుదైనది. పది లక్షల మంది రోగులలో ఒకరికే వస్తుంది. జరిగింది వైద్యపరమైన ప్రమాదం. బాధితుడైన బిడ్డ చికిత్స కోసం సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందించడానికి సంబంధిత వైద్యులు సిద్ధంగా ఉన్నారు" అని ఆయన తన వివరణలో పేర్కొన్నారు.

"కొన్ని రోజుల్లో బిడ్డ పరిస్థితి మెరుగుపడుతుంది. తల్లిదండ్రులకు కలిగిన మానసిక వేదనకు వైద్య సంఘం విచారం వ్యక్తం చేస్తోంది. బిడ్డ పురుషాంగాన్ని పూర్తిగా తొలగించలేదు. కేవలం చిన్న భాగాన్ని మాత్రమే తొలగించి ప్లాస్టిక్ సర్జరీతో పునర్నిర్మాణ మైక్రోసర్జరీ చేశారు" అని శ్రీధర్ చెప్పారు.

దీనిపై బీబీసీ కారైకుడిలోని సంబంధిత ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాన్ని సంప్రదించింది.

"ఈ విషయంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇప్పటికే వివరణ ఇచ్చింది" అని వాళ్లు చెప్పారు.

వైద్యుల నిర్లక్ష్యం, బాలుడి పురుషాంగం సర్జరీ,  ఇండియన్ మెడికల్ అసోసియేషన్

ఫొటో సోర్స్, Getty Images

'పురుషాంగంలో చాలా భాగం తొలగించారు'

"అధికారులకు ఫిర్యాదు చేసిన తర్వాత ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి మాకు ఎలాంటి సాయం అందలేదు. నా కొడుకు పురుషాంగంలో చాలా భాగం తొలగించారు. ఇప్పుడు కేవలం వృషణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి" అని బాలుడి తల్లి చెప్పారు.

బాలుడు ఇప్పటికీ ఆ షాక్ నుంచి కోలుకోలేదు. బయటకు కూడా వెళ్లలేకపోతున్నాడని ఆమె అన్నారు.

"వాడి వయసున్న అబ్బాయిలు ఎగతాళి చేస్తున్నారు. దాంతో వాడు బాధ పడుతున్నాడు. వాడు ఎవరితోనూ మాట్లాడడు, ఎప్పుడూ ఒకే చోట నిశ్శబ్దంగా కూర్చుంటాడు. ఇంత చిన్న వయసులో ఇలా జరగడంతో పెద్దయ్యాక ఎలా తట్టుకుంటాడో తెలియడం లేదు" అని బాలుడి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

ఫిర్యాదు దాఖలు చేసి నెల రోజులు గడిచినా వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సీపీఐ నాయకులు, కార్మిక సంఘాలతో కలిసి జూలై 7న నిరసన ప్రదర్శన నిర్వహించారు.

"బిడ్డ భవిష్యత్తు అనిశ్చితంగా మారింది. డాక్టర్లను అరెస్టు చేయలేదు. అందుకే నిరసన చేపట్టాం. పోలీసులు మమ్మల్ని అదుపులోకి తీసుకుని సాయంత్రం వరకు నిర్బంధంలోనే ఉంచారు" అని సీపీఐకి చెందిన శివాజీ గాంధీ చెప్పారు.

"డాక్టర్లలో ఒకరిపై ఇప్పటికే కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో పోలీసులు ఇంత నెమ్మదిగా వ్యవహరించకూడదు" అని ఆయన అన్నారు.

సీపీఐ, ఇతర సంస్థలు నిరసన చేయడంతో తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ కారైకుడిలోని ప్రైవేటు ఆసుపత్రులు జులై 10న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైద్య సేవల్ని నిలిపివేశాయి.

"ఈ వ్యవహారంలో ఇప్పటికే కేసు నమోదు చేశాం, ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ దర్యాప్తు చేస్తున్నారు. ఆయన నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పు జరిగినట్లు తేలితే వైద్యులపై చర్యలు తీసుకుంటాం" సౌత్ రీజియన్ ఐజీ విజయేంద్ర బిడారి బీబీసీతో చెప్పారు.

వైద్యుల నిర్లక్ష్యం, బాలుడి పురుషాంగం సర్జరీ,  ఇండియన్ మెడికల్ అసోసియేషన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పురుషాంగానికి సంబంధించిన వ్యాధుల చికిత్స కోసం పెనెక్టమీ నిర్వహిస్తారు. ( ప్రతీకాత్మక చిత్రం)

పెనెక్టమీ అంటే ఏమిటి?

పెనెక్టమీ అనేది పురుషాంగాన్ని తొలగించే శస్త్రచికిత్స.

రోగి వైద్య పరిస్థితిని బట్టి శస్త్రవైద్యులు పురుషాంగంలోని కొంత భాగాన్ని లేదా మొత్తం పురుషాంగాన్ని తొలగించవచ్చు. పురుషాంగ సంబంధిత వ్యాధులకు చికిత్స చేయడానికి ఈ శస్త్రచికిత్స చేస్తారని స్టాన్లీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్‌లో జనరల్ మెడిసిన్ హెడ్ డాక్టర్ ఎస్. చంద్రశేఖర్ చెప్పారు.

"ఈ సర్జరీని సాధారణంగా పురుషాంగానికి క్యాన్సర్ సోకిన కేసులలో ఉపయోగిస్తారు. కారైకుడికి చెందిన ఈ బాలుడి విషయంలో, తీవ్రమైన బాక్టీరియా ఇన్ఫెక్షన్ కారణంగా పురుషాంగానికి రక్త ప్రసరణ ఆగిపోయి ఉండవచ్చు లేదా పురుషాంగ కణజాలం చనిపోయి ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో, ఇన్ఫెక్షన్ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించకుండా నిరోధించడానికి పురుషాంగంలోని ఒక నిర్దిష్ట భాగాన్ని తొలగించి ఉండవచ్చు" అని ఆయన చెప్పారు.

అయితే ఆరోగ్య శాఖ నివేదిక వచ్చిన తర్వాతే ఈ విషయంలో ఏదైనా ఒక నిర్ధరణకు రాగలమని ఆయన స్పష్టం చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)