సోనమ్ వాంగ్‌చుక్ : 'దీక్ష విరమణకు నాపై ఒత్తిడి తేకండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి’

- రచయిత, దిగవల్లి పవన్ కాంత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష 19వరోజుకు చేరింది. ఈ 19 రోజుల్లో ఆయన 9.1 కేజీల బరువు తగ్గారు. ప్రస్తుతం 56.9 కేజీల బరువున్నారు.
''ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తోంది. ప్రతీరోజు రెండు సార్లు ఉదయం, సాయంత్రం, ఆయనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బీపీ, షుగర్ లెవెల్స్ చూస్తున్నారు. బరువు చెక్ చేస్తున్నారు,'' అని సీజేపీ అధికార ప్రతినిధి వైష్ణవి గౌర్ చెప్పారు.
దిల్లీ మెడికల్ అసోసియేషన్ మాజీ సెక్రటరీ డాక్టర్ సతీష్ లాంబా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల వైద్య బృందం సోనమ్ వాంగ్‌చుక్‌కు రోజూ వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది.
ప్రస్తుతం సోనమ్ వాంగ్‌చుక్ వైటల్స్ స్థిరంగా ఉన్నా దీక్ష ఇలానే కొనసాగితే ఇకపై కండరాల క్షీణత ఉంటుందని, దాని ప్రభావం శరీర అవయవాలపై పడుతుందని డాక్టర్ సతీశ్ లాంబా చెప్పారు.
అలా జరిగితే అది మరింత ప్రమాదకరంగా పరిణమించవచ్చని ఆయన చెప్పిన వివరాలతో సీజేపీ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్షను బలవంతంగా విరమింప చేయాలని కోరుతూ బుధవారం దిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
దీనిపై గురువారం విచారించిన కోర్టు ఈ వ్యాజ్యాన్ని కొట్టేసింది.
‘‘దేశంలో అందరి ప్రాణాలు అత్యంత విలువైనవని సోనమ్ ఆరోగ్య స్థితిని నిరంతరం మానిటర్ చేయాలని, అవసరమైనపుడు తగిన వైద్య చికిత్సలు అందించాలని’’ దిల్లీ హైకోర్టు సూచించింది.
వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోందని ప్రభుత్వం ఇప్పటికైనా తమ డిమాండ్లను నెరవేర్చాలని కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు అంటున్నారు.
విద్యా సంస్కరణలను డిమాండ్ చేస్తూ ఆన్‌లైన్‌లో వ్యంగ్యాత్మకంగా ప్రారంభమైన 'కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)' ఉద్యమానికి మద్దతుగా వాంగ్‌చుక్ ఆందోళన చేస్తున్నారు.
ఈ ఉద్యమకారుల ప్రధాన డిమాండ్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నదే. వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్-యూజీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడంతో ఈ ఏడాది మే ప్రారంభంలో పరీక్షను రద్దు చేశారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాన్ పదవికి రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.
అయితే, ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం సీజేపీని, దానికి మద్దతు ఇస్తున్న వారిని విధ్వంసకర శక్తుల బీ-టీమ్" గా చెబుతున్నారు . నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా నిరసనకారులతో ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరపలేదు.

'ప్రభుత్వాన్ని ప్రశ్నించండి'
ఆమరణ నిరాహార దీక్షను విరమించాలంటూ సోనమ్‌పై ఒత్తిడి పెరుగుతోంది.
దీక్ష విరమించాలని దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు, రాజకీయ నేతలు, సినీ తారలు విజ్ఞప్తి చేస్తున్నారు.
దిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా సోనమ్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు జరిగాయి.
ఈ నేపథ్యంలో స్పందించిన సోనమ్, బుధవారం రాత్రి ఒక వీడియోను విడుదల చేశారు.
''నన్ను ఒత్తిడి చేస్తే ఏమవుతుంది. నేను దీక్షను విరమిస్తే దేశానికి ఎలాంటి సందేశం వెళ్తుంది? ఎలాంటి జవాబుదారీతనం అవసరం లేదని ప్రభుత్వం భావించే అవకాశం ఉంటుంది. కాబట్టి నాపై ఒత్తిడి తేవడం ఆపి, ఇప్పటి వరకు మన డిమాండ్లపై స్పందించని ప్రభుత్వాన్ని ప్రశ్నించండి'' అని సోనమ్ అన్నారు.
సోనమ్ దీక్షను విరమించాలని కోరుతూ కాంగ్రెస్ నేత శశి థరూర్, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
గురువారం సోనమ్‌ను కలిసి మద్దతు తెలపడానికి ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్, సమాజ్‌వాదీ పార్టీ నుంచి డింపుల్ యాదవ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ యశ్వంత్ అంబేడ్కర్ జంతర్ మంతర్‌కు వచ్చారు.

క్షీణిస్తున్న మరో నలుగురి పరిస్థితి
సోనమ్‌తోపాటుగా మరో నలుగురు సీజేపీ మద్దతుదారులు కూడా ఆమరణ నిహాహార దీక్ష మొదలుపెట్టారు.
సోనమ్ ఉంటున్న ప్రధాన టెంటుకి పక్కనే మరో టెంటులో ఈ నలుగురూ దీక్ష చేస్తున్నారు.
వీళ్ల పరిస్థితి కూడా క్షీణిస్తోందని వైద్యులు చెబుతున్నారు.
బుధవారం వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆ వ్యక్తిని సమీప రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు.
''మిగిలిన ముగ్గురి పరిస్థితి కూడా రోజురోజుకూ క్షీణిస్తోంది. సోనమ్‌ను మానిటర్ చేస్తున్న వైద్య బృందమే వీళ్ల ఆరోగ్య స్థితిని కూడా మానిటర్ చేస్తోంది. రోజూ వీళ్లకు కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీళ్ల వైటల్స్ క్షీణిస్తున్నాయి. తలపోటు, కడుపులో తిప్పడం, కండరాల క్షీణత, నరాలు పట్టేయడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు'' అని ఈ టెంటు దగ్గర పరిస్థితిని గమనించే సీజేపీ మద్దతుదారు అంజలి చెప్పారు.

సోనమ్‌కు మద్దతుగా..
సోనమ్ వాంగ్‌చుక్ దీక్షకు మద్దతుగా గురువారం ఒకరోజు నిరాహార దీక్ష కోసం అనేక మంది మద్దతుదారులొచ్చారు. వీరిలో ఎక్కువగా విద్యార్థులే కనిపించారు.
వీరిలో చాలా మందికి తలపోటు, వేడి తీవ్రత వలన డీహైడ్రేషన్ సమస్యలు వస్తున్నాయని ఇక్కడ ఏర్పాటు చేసిన మెడికల్ టెంట్‌లో వలంటీర్‌గా పని చేస్తున్న డాక్టర్ అక్షయ్ సాహా చెప్పారు.
చాలా మంది వలంటీర్లుగా వచ్చి మందులను డొనేట్ చేశారని, వాటినే ఇక్కడ దీక్ష చేస్తున్నా వారిలో అవసరమైన వాళ్లకు ఇస్తున్నామని అక్షయ్ తెలిపారు.
"పొద్దున్నుంచి ఎక్కువగా డీహైడ్రేషన్ సమస్యతో బాధపడుతున్న వాళ్లు మా దగ్గరకి వస్తున్నారు. ఎక్కువగా గ్లూకోజ్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అడిగి తీసుకెళ్తున్నారు. మా దగ్గర ఫస్ట్ ఎయిడ్‌కు సంబంధించినవన్నీ అందుబాటులో ఉన్నాయి. తలపోటు, కడుపు నొప్పి, జలుబు, జ్వరం లాంటి సమస్యలకు పనిచేసే మందులున్నాయి'' అని డాక్టర్ అక్షయ్ సాహా చెప్పారు.

కట్టుదిట్టమైన భద్రత
ఇక నిరసన ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
దిల్లీ పోలీసులు, సీఐఎస్‌ఎఫ్, రాపిడ్ యాక్షన్ బలగాలు, మహిళా పోలీసులను భారీ సంఖ్యలో మోహరించారు.
మొబైల్ నిఘా వాహనాలున్నాయి.
సీసీటీవీ కెమెరాలు అందరినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.
డ్రోన్ల ద్వారా నిరసన ప్రాంగణంలో ఉన్న వారందరినీ గమనిస్తున్నారు.
పోలీసు డిపార్ట్‌మెంట్ నుంచి ప్రత్యేక ఫోటోగ్రాఫర్లను మోహరించారు.

జులై 20న పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు
పార్లమెంటు సమావేశాలు మొదలుకానున్న నేపథ్యంలో జులై 20న జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు వరకూ శాంతియుత ర్యాలీ నిర్వహించేందుకు సీజేపీ పిలుపునిచ్చింది.
దీని కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నంబరుకి మిస్డ్ కాల్ ఇచ్చి రెండు లక్షల మంది రిజిస్టర్ చేసుకుని పార్లమెంట్ మార్చ్‌కు మద్దతు తెలిపారని సీజేపీ అధికార ప్రతినిధి వైశాలి గౌర్ తెలిపారు.
ఈ మార్చ్ కోసం పోలీసులకు ఇప్పటికే సమాచారం ఇచ్చామని చెప్పిన వైశాలి పోలీసుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు.
సోమవారం జరగబోయే పార్లమెంట్ మార్చ్ కోసం ఎంతమంది వస్తారనే స్పష్టమైన అంచనాలేవీ లేవని వైశాలి గౌర్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































