డీఆర్ కాంగో: చెట్ల చిటారు కొమ్మన రహస్యంగా జీవించే కొత్త కోతి జాతిని కనుగొన్న పరిశోధకులు

ఫొటో సోర్స్, Junior Amboko
- రచయిత, విక్టోరియా గిల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అడవుల్లో నల్లని ముఖంతో కొట్టొచ్చినట్టు కనిపించే గులాబీ ఛాయ కలిసిన నారింజ రంగు పెదాలున్న ఓ కోతిని శాస్త్ర ప్రపంచం కొత్తజాతిగా అధికారికంగా గుర్తించింది.
కాంగో మధ్య- తూర్పు ప్రాంతంలోని ఉష్ణమండల అడవుల్లోని లోమామి నేషనల్ పార్క్‌లో ఎత్తైన చెట్ల దట్టమైన ఆకుల మధ్య దాక్కుని ఉన్న ఈ నల్లని రోమాలు గల వానరాన్ని పరిశోధకులు గుర్తించి చిత్రీకరించారు.
అయితే ఈ అసాధారణ రూపం కలిగిన కోతిని తొలిసారి 2008లో చూసినట్టు అక్కడ పనిచేస్తున్నవారు చెప్పారు. అప్పట్లో వారికి దీనికి సంబంధించి ఓ మసకబారిన ఫోటో మాత్రమే చిక్కింది.
కానీ, పదేళ్ల తర్వాత ఈ కోతి మరోసారి కనిపించడంతో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం కాంగో చేరుకుంది. క్షుణ్ణంగా అధ్యయనం చేసిన అనంతరం, ఇది శాస్త్రప్రపంచానికి తెలియని ఒక కొత్త జాతి అని నిర్థరించారు.
గత 75 సంవత్సరాల్లో ఆఫ్రికాలో కొత్తగా గుర్తింపు పొందిన కోతి జాతుల్లో ఇది ఐదోది.

ఫ్లోరిడాలోని అట్లాంటిక్ యూనివర్సిటీకి చెందిన పీహెచ్‌డీ విద్యార్థి జూనియర్ అంబోకో ఈ పరిశోధనలో కీలక పాత్ర పోషించారు. ఇందులో భాగంగా ఆడియో రికార్డింగ్, ఫోటోగ్రఫీ, జన్యు విశ్లేషణ లాంటి పద్ధతులు ఉపయోగించి ఈ బృందం పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసింది.
ఈ పరిశోధన ఫలితాలు ప్లాస్ వన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
"అతి కొద్దిమందికి మాత్రమే తెలిసిన ఈ జీవిని ప్రత్యక్షంగా చూడటం నిజంగా వర్ణించలేని అనుభూతి" అని జూనియర్ అంబోకో బీబీసీ న్యూస్‌తో అన్నారు.

ఫొటో సోర్స్, Junior Amboko
రహస్య జాతులు
ఒక జాతిని కనుక్కోవడం అంటే అది జన్యు పరంగా ప్రత్యేకంగా పరిణామం చెందినట్లు అధికారికంగా ధృవీకరించడమే.
అయితే స్థానిక ప్రజలకు ఈ కోతి గురించి ఇంతకు ముందే తెలుసు. వాళ్లు దాన్ని 'లిక్వెలి' అని పిలుస్తున్నారు.
ఈ కోతులు "సిగ్గరులు అని. అవి చెట్ల ఎత్తైన భాగాల్లో దాక్కుని ఉంటాయి" అని అంబోకో చెప్పారు.
"మా పరిశోధనలో భాగంగా ఇవి నివసించే ప్రాంతాల సమీపంలోని 52 గ్రామాల ప్రజలతో మేం మాట్లాడాము. అందులో 8 గ్రామాల ప్రజలు మాత్రమే వాటిని చూసినట్లు చెప్పారు" అని ఆయన అన్నారు.
కాంగో, అమెరికా, జర్మనీకి చెందిన పరిశోధన బృందం, కాంగోలోని జీవ వైవిధ్యానికి గుర్తుగా ఆ కోతికి "కొలోబస్ కాంగోనెసిస్" అనే లాటిన్ పేరు పెట్టింది.
ఇది కొలోబస్ కోతుల సమూహానికి చెందింది. "ఇవి ఆఫ్రికాకు చెందిన బొటనవేళ్లు లేని అత్యంత ముఖ్యమైన కోతులు" అని ఫ్లోరిడాలోని అట్లాంటిక్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కేట్ డెట్‌వైలర్ వివరించారు.

ఫొటో సోర్స్, Junior Amboko
"ఇవి అడవిలో చెట్ల చిటారు కొమ్మల్లో నివసించే శాకాహార జంతువులు. పర్యావరణ వ్యవస్థలో అత్యంత కీలకమైనవి. అడవిలో విత్తనాల వ్యాప్తి, అవి మొలకెత్తడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయని భావిస్తున్నాం" అని ప్రొఫెసర్ డెట్‌వైలర్ చెప్పారు.
వాటి మొహం మీద ప్రకాశవంతమైన గుర్తులు ఇతర జంతువులకు సంకేతం కావచ్చని, ఇతర కోతులు ఒక దాన్ని ఒకటి గుర్తించడానికి , సంభోగ సమయంలో తోడును ఆకర్షించడానికి సహాయ పడతాయని ఆమె తెలిపారు.
ఈ కోతులకు ఓ ప్రత్యేకమైన 'గర్జన' సంకేతాలు కూడా ఉన్నాయి. "వాటి అరుపు తరచుగా వినిపిస్తుంది. కానీ అవి కనిపించవు " అని అంబోకో చెప్పారు.
ఈ జంతువులు చాలా అరుదుగా ఉంటాయని, తమకు అవసరమైన ఆహారం, నివాసం లభించే అడవిలోని ఒక నిర్దిష్ట ప్రాంతానికే పరిమితమై ఉన్నాయని వారు భావిస్తున్నారు.
వీటిని మాంసం కోసం వేటాడుతారు. అయితే ఇప్పుడు వీటిని ప్రత్యేక జాతిగా వర్గీకరించినందున అధికారిక రక్షణ లభిస్తుందని పరిశోధకులు ఆశిస్తున్నారు.
రహస్య స్వభావం గల ఈ కొత్త కోతి జాతి గురించి ఇంకా అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాల్సి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. వాటి సంఖ్యను అంచనా వేయడానికి, వాటి ప్రవర్తనను అధ్యయనం చేయడానికి సమగ్ర సర్వే చేయాలని భావిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































