లైవ్, ‘విద్యార్థులేమీ ఉగ్రవాదులు కారు.. వారే భవిష్యత్’ - రాహుల్ గాంధీ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం దిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ‘విద్యార్థులకు ఇలా ఎందుకు జరుగుతోంది అనేదే ప్రశ్న. విద్యార్థులు చేసిన తప్పు ఏమిటి?’ అని ప్రశ్నించారు. నిరసన చేస్తున్న విద్యార్థులు ఉగ్రవాదులు కాదు, వారే మన భవిష్యత్తు అని.. దీనికి బాధ్యులైన వారందరిపై చర్య తీసుకోవాలని రాహుల్ గాంధీ అన్నారు.

సారాంశం

  • దిల్లీలోని ఇందిర భవన్‌లో బుధవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ‘నిరసన తెలుపుతున్న విద్యార్థులేమీ ఉగ్రవాదులు కారు.. వారే మన భవిష్యత్’ అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
  • జులై 20న జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలుపుతున్న వారిపై పోలీసుల చర్యకు సంబంధించి దాఖలైన రెండు పిటిషన్లపై దిల్లీ హైకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వానికి, దిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
  • ప్రభుత్వం చర్చలు జరిపేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా నివాసానికి రావాల్సిందిగా తమకు ఆహ్వానం అందిందనీ, కానీ దాన్ని తిరస్కరించామని కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.

లైవ్ కవరేజీ

  1. దిల్లీలో 16 మెట్రో స్టేషన్ల నుంచి రాకపోకలు బంద్

    Rajiv Chowk Metro station

    ఫొటో సోర్స్, Getty Images

    దిల్లీలో నిరసనల నేపథ్యంలో గురువారం (23.07.2026) కూడా మెట్రో రైల్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. 16 మెట్రో స్టేషన్లను గురువారం ఉదయం 7.30 నుంచి మూసివేస్తున్నామని, తదుపరి సూచనలు వచ్చేవరకు ఈ స్టేషన్ల నుంచి రాకపోకలకు వీలుండదని ‘దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్’ తన ‘ఎక్స్’ ఖాతాలో వెల్లడించింది.

    మూసివేసిన స్టేషన్లు ఇవే..

    1) లోక్ కల్యాణ్ మార్గ్

    2) రాజీవ్ చౌక్

    3) పటేల్ చౌక్

    4) రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్

    5) బారాఖంభా రోడ్

    6) సుప్రీంకోర్ట్

    7) సేవా తీర్థ్

    8) జన్‌పథ్

    9) మండీహౌస్

    10) సెంట్రల్ సెక్రటేరియట్

    11) ఐటీఓ

    12) దిల్లీ గేట్

    13) ఇంద్రప్రస్థ

    14) ఖాన్ మార్కెట్

    15) జోర్ బాగ్

    16) శివాజీ స్టేడియం

    అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ప్రయాణికులు ఒక లైన్ నుంచి మరొక లైన్‌కు మారే సౌకర్యం ఎప్పటిలా అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

  2. ‘నిరసన చేస్తోన్న విద్యార్థులేమీ ఉగ్రవాదులు కారు, వారే మన భవిష్యత్’, – ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రాహుల్ గాంధీ

    రాహుల్ గాంధీ

    ఫొటో సోర్స్, PTI

    కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

    ఈ కాన్ఫరెన్స్‌లో ధర్మేంద్ర ప్రధాన్ గురించి, నిరసన చేస్తోన్న విద్యార్థుల గురించి, ప్రధానమంత్రి నివాసం బయట జరిగిన నిరసన గురించి మాట్లాడారు.

    ‘‘మన విద్యార్థులకు ఎందుకిలా జరుగుతోంది అనేదే ప్రశ్న? మన విద్యార్థులు చేసిన తప్పు ఏంటి? భద్రతా బలగాలు వారి ముందు ఆయుధాలు పట్టుకుని నిల్చున్నాయి. వాళ్లు చేసిన తప్పేంటి?’’ అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

    ‘‘నిరసన చేస్తోన్న విద్యార్థులేమీ టెర్రరిస్టులు కాదు, వారే మన భవిష్యత్’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

    దీనికి బాధ్యులైన వారందరిపై చర్య తీసుకోవాలని రాహుల్ గాంధీ కోరారు.

    ప్రధాని నరేంద్ర మోదీ నివాసం బయట జరిగిన నిరసన గురించి అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ‘‘భారత విద్యార్థులు వీధుల్లోకి వస్తే, ప్రతిపక్షం కూడా వీధుల్లోకి రావాలని మేం భావించాం. ఇదే ప్రధాన కారణం’’ అని అన్నారు.

    ప్రధాని నివాసానికి వెళ్లే ముందు, తాను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా దగ్గరకు వెళ్లి, సభలో విద్యార్థుల సమస్యపై మాట్లాడాలనుకుంటున్నట్లు చెప్పినట్లు తెలిపారు. అప్పుడు ఓం బిర్లా తాను ప్రభుత్వాన్ని అడుగుతానని చెప్పారని పేర్కొన్నారు.

    ఆ తర్వాత దీనిపై ఎలాంటి చర్చ జరగలేదని, మొత్తం విషయాన్ని పక్కకు పెట్టేశారని రాహుల్ గాంధీ అన్నారు.

    ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పందించిన ఆయన, ‘‘ధర్మేంద్ర ప్రధాన్ ఒక ప్రతీక. విద్యార్థులతో వ్యవహరిస్తున్న తీరు పట్ల విద్యార్థులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విద్యార్థుల గౌరవం కోసం, ఆ 'ధర్మేంద్ర ప్రధాన్' అనే ప్రతీకను తొలగించాల్సిందే" అని డిమాండ్ చేశారు.

  3. నమస్తే, బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    దేశంలో, ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ వార్తలను ఎప్పటికప్పుడు ఇక్కడ అప్టేడ్ చేస్తాం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    బీబీసీ న్యూస్ తెలుగు వెబ్‌సైట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని ముఖ్యమైన వార్తలను ఇక్కడ చదవొచ్చు.